మహిళల సౌందర్యాన్ని పెంపొందించడంలో కురులు కూడా ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. అవి నల్లగా, నిగనిగలాడుతుంటే.. అందంగా వున్న ముఖసౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలాకాకుండా జుట్టు నిర్జీవంగా, నీరసించినట్లుగా కనిపిస్తే.. అవి సౌందర్యానికి దెబ్బతీస్తాయి. అలాకాకుండా వుండాలంటే.. కురులను నిగారింపు పెంచుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసం బ్యూటీపార్లర్లకో, రకరకాల బ్యూటీ ప్రోడక్టులను వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే జుట్టు సమస్యను సరిచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ‘హెయిర్ స్పా’తోనే సాధ్యమవుతుందని వారు సూచిస్తున్నారు. మరి.. దానిని ఏ విధంగా జుట్టుకు రాసుకోవాలో తెలుసుకుందామా..
ఒక పాత్ర తీసుకుని అందులో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె తదితరాలను సముపాళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. కొద్దిసేపు చల్లార్చుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మునివేళ్ళతో తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించాలి. 10 నుంచి 20 నిమిషాలపాటు మర్దన చెయ్యాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్ళు వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆ వేడినీళ్ళలో ఒక టవల్ ముంచి నీళ్ళు కారకుండా పిండివేయాలి. గోరువెచ్చగా ఉన్న ఆ టవల్‌ను జుట్టంతా మూసి ఉండేలా తలకు చుట్టుకుని 15 నిమిషాలపాటు ఉండాలి. ఇలాచేయడం వల్ల, అంతకుముందు పట్టించిన ఆయిల్ మిశ్రమం జుట్టు కుదుళ్ళకు బాగా ఇంకుతుంది. నూనె పట్టించి స్టీమ్ ఇచ్చిన జుట్టును రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు తలస్నానం చెయ్యవచ్చు.
షాంపూతో లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు కండీషనర్ అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇక హెయిర్ స్పాలో ఆఖరి దశ జుట్టుకు ప్యాక్ వెయ్యడం. జుట్టుతత్వాన్ని బట్టి ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చొప్పున నెలరోజుల పాటు చేసి, ఆ తర్వాత క్రమంగా అవసరాన్నిబట్టి నెలకు ఒకటి రెండు సార్లు చేసుకున్నట్టయితే కురులు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.