బ్రెస్ట్ క్యాన్సర్: ఈ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గాలు.. పరీక్షలు

0
Breast cancer prevention

మహిళలు సాధారణంగా తమ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఇల్లు, ఇంటి పనులు, పిల్లలు, ఉద్యోగం.. ఇలాంటి వాటితోనే వారి దినచర్య బిజీబిజీగా ఉంటుంది. దీంతో పాటు సరిగ్గా వారు తమ అరోగ్యంపై శ్రద్ద చూపాల్సిన సమయంలోనే పిల్లలు, వారి ఆలనా, పాలన.. వారికి చిరుతిళ్లు.. ఇలా నిత్యం పనిలోనే నిమగ్నమవుతారు. అయితే మహిళలు 30 ఏళ్లు నిండి నిండగానే తమ అరోగ్యంపై శ్రద్ద వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ వయస్సు నుండి వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టవచ్చు. ప్రతి ఒక్కరికీ రెగ్యులర్ మెడికల్ చెకప్ అవసరమని వైద్యనిపుణులు పేర్కోంటున్నారు. నిత్యం దినచర్యలో భాగంగా వారు పనిలో మునిగిపోతూ ఉండటం వల్ల వృద్ధాప్యం జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా మధుమేహం, హైపర్‌టెన్షన్‌ వంటి అనేక వ్యాధులకు దారితీస్తోంది. 30 ఏళ్ల వయస్సులో మహిళల్లో అనేక హార్మోన్ల మార్పులు ప్రారంభమవుతాయని వైద్యనిపుణులు పేర్కోంటున్నారు.

అయితే వారు క్రమం తప్పకుండా భవిష్యత్తులో సంక్రమించనున్న పలు రకాల అనారోగ్యాల నుంచి వారిని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయిని వారు సూచిస్తున్నారు. అందులోనూ అధిక శాతం మంది మహిళలు అవగాహనా రాహిత్యంతో క్యాన్సర్ల బారిన పడి తీవ్ర పోరాటం చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణజాలం నుండి ఉద్భవించే క్యాన్సర్. సాధారణంగా ఇది పాలను ఉత్పత్తి చేసే గ్రంధుల కణజాలం నుండి ఆరోగ్యకరమైన రొమ్ము కణజాలంపై దాడి చేస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ను బాహ్య లక్షణాల ద్వారా నిర్ధారించడం కష్టమే. భారతదేశంలో మహిళలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్ మహమ్మారి.. రొమ్ము క్యాన్సర్. ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం, ముందస్తుగా నిర్ధారణ పరీక్షలు లేకపోవడం వల్ల, చాలా మంది రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలు వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే వైద్యులను సంప్రదిస్తారు. ఇప్పటికీ ఈ అంశం బహిరంగ చర్చకు సంబంధించిన అంశం కాకపోవడంతో దీనిపై మహిళలే మహిళల వద్ద మాట్లడలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

మూడు పదులు నిండినిండగానే మహిళలను అత్యధికంగా కలవరపెడుతున్న మహమ్మారి ఈ రొమ్ము క్యాన్సర్. ఈ మహమ్మారి గురించిన ఆలోచనలలో అనేకమంది మహిళలు బాధపడుతుంటారు. రొమ్ములో క్యాన్సర్ కణాల ఉనికి గురించి తెలుసుకోవాలనే వారిలో ఆసక్తి రేకెత్తుతుంది. ఇది ఓ రకంగా శుభసూచకమే. గతంలో క్యాన్సర్ వచ్చిన వారిలో, బ్రెస్ట్ లో గడ్డలు ఉన్నవారిలో, జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో, చిన్నవయసులో రుతుక్రమం వచ్చినా, మెనోపాజ్ ఆలస్యంగా వచ్చినా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటీ.?

రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగడంతో అది కాస్తా క్యాన్సర్ కణాలుగా మారి రొమ్ము క్యాన్సర్ గా వృద్దిచెందుతాయి. రొమ్ము క్యాన్సర్లులోనూ వివిధ రకాలు ఉన్నాయి. రొమ్ములోని ఏ కణాలు క్యాన్సర్‌గా మారుతుందో దానిపై ఆధారపడి రొమ్ము క్యాన్సర్ రకాలు ఉంటాయి. దీనిని బట్టి రొమ్ము క్యాన్సర్.. రొమ్ము యొక్క వివిధ భాగాలలో ప్రారంభం అవుతాయని అవగతం అవుతుంది. రొమ్ము మూడు ప్రధాన భాగాలతో రూపొందించబడింది: లోబుల్స్, నాళాలు, బంధన కణజాలం. లోబుల్స్ అంటే పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు. నాళాలు చనుమొనకు పాలను తీసుకువెళ్లే గొట్టాలు. బంధన కణజాలం (ఇది పీచు, కొవ్వు కణజాలంతో కూడి ఉంటుంది) ప్రతి భాగాన్ని చుట్టుముడుతుంది. చాలా రొమ్ము క్యాన్సర్లు నాళాలు లేదా లోబుల్స్‌లో ప్రారంభమవుతాయి. రొమ్ము క్యాన్సర్ రక్త నాళాలు, శోషరస నాళాల ద్వారా రొమ్ము వెలుపల వ్యాపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు, అది మెటాస్టాసైజ్ చేయబడిందని చెబుతారు.

రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకాలు-

ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా.

క్యాన్సర్ కణాలు నాళాలలో ప్రారంభమవుతాయి, నాళాల వెలుపల రొమ్ము కణజాలంలోని ఇతర భాగాలలోకి పెరుగుతాయి. ఇన్వాసివ్ క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయి లేదా మెటాస్టాసైజ్ చేయబడతాయి.

ఇన్వాసివ్ లోబ్యులర్ కార్సినోమా.

క్యాన్సర్ కణాలు లోబుల్స్‌లో ప్రారంభమై తరువాత లోబుల్స్ నుండి దగ్గరగా ఉన్న రొమ్ము కణజాలాలకు వ్యాపిస్తాయి. ఈ ఇన్వాసివ్ క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయి.

పేజెట్స్ వ్యాధి, మెడల్లరీ, మ్యూకినస్, ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనేక ఇతర తక్కువ సాధారణ రకాల రొమ్ము క్యాన్సర్‌లు కూడా ఉన్నాయి. డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) అనేది రొమ్ము వ్యాధి, ఇది ఇన్వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఈ తరహా క్యాన్సర్లలో ఆ కణాలు నాళాల లైనింగ్‌లో మాత్రమే కోనసాగి.. ఇతర కణజాలాలకు వ్యాపించకుండా ఉంటాయి.

రోమ్ము క్యాన్సర్ లక్షణాలు:

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండాలని లేదు. ఒక్కోక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. కొందరిలో అలక్షణంగా క్యాన్సర్ వృద్ది చెందవచ్చు. ఇలాంటి తరుణంలో ఎలాంటి సంకేతాలు కానీ లక్షణాలు కానీ కనిపించవు. అయితే సర్వసాధారణంగా కనిపించే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఇలా:

  • రొమ్ము లేదా అండర్ ఆర్మ్ (చంక)లో కొత్త గడ్డ.
  • రొమ్ము భాగం గట్టిపడటం లేదా వాపు.
  • రొమ్ము చర్మం చికాకు లేదా డింప్లింగ్.
  • చనుమొన ప్రాంతంలో లేదా రొమ్ములో చర్మం ఎర్రబడటం లేదా పొరలుగా మారడం
  • చనుమొనను లాగడం లేదా చనుమొన ప్రాంతంలో నొప్పి.
  • తల్లి పాలతో పాటు నిపుల్ డిశ్చార్జ్ కావడం.. రక్తం కారడం.
  • రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో ఏదైనా మార్పు.
  • రొమ్ము యొక్క ఏదైనా ప్రాంతంలో నొప్పి.
  • ఈ లక్షణాలు క్యాన్సర్ లేని ఇతర పరిస్థితులతో సంభవించవచ్చని గుర్తుంచుకోండి.

బ్రెస్ట్ క్యాన్సర్ స్ర్కీనింగ్ అంటే ఏమిటీ.?

రొమ్ములో ఏదైనా నోప్పి లేదా సమస్యతో వైద్యులను సంప్రదించినప్పుడు.. వారి రొమ్ములను తనిఖీ చేయడాన్ని స్ర్కీనింగ్ అంటారు. అయితే మహిళా రోగులు వారి చెప్పే వివరాలను బట్టి.. ఎలాంటి సంకేతాలు, లక్షణాలను గుర్తించకుముందు వైద్యులు అనుమానంతో నిర్వహించే ప్రక్రియ. ఈ స్ర్కీనింగ్ పరీక్షలపై మహిళలందరికీ వారికి ఉత్తమ స్క్రీనింగ్ ఎదన్న విషయమై హెల్త్ అడ్వైజర్లు తెలియజేయాలి. స్క్రీనింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి వారు మీకు అవగాహన కలిగిస్తారు. స్క్రీనింగ్ మీకు సరైనదా కాదా అని మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో నిర్ణయించినప్పుడు-అలా అయితే, దానిని ఎప్పుడు నిర్వహించుకోవాలన్న విషయమై మీ భాగస్వామిని పిలిపించి వారు మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు.

రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ తో దానిని నిరోధించలేనప్పటికీ, ఇది ఎలాంటి ప్రమాదం పోంచివుందన్న విషయాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది, తద్వారా రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగానే గుర్తించే వీలు ఉంటుంది. దీని ద్వారా దానిని చికిత్స చేయడం సులభంగా మారడంతో పాటు ప్రాణపాయ స్థితి స్థాయికి వెళ్లకుండా చర్యలు తీసుకుండో సహాయ పడుతుంది. మీకు ఏ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సరైనవి, మీరు వాటిని ఎప్పుడు చేయించుకోవాలి అనే దాని గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.

రొమ్ము క్యాన్సర్ కనుగొనుటకు మామోగ్రఫీ పరీక్ష

మామోగ్రామ్ అనేది రొమ్ము భాగంలో తీసే ఎక్స్-రే. చాలా మంది మహిళలకు, రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే కనుగొనడానికి మామోగ్రామ్‌లు ఉత్తమ మార్గం, క్యాన్సర్ ఉందని అనుమానాలను నివృత్తి చేసుకోవడంలో ఇది ఉత్తమ మార్గం. దీని ద్వారా ముందస్తు చికిత్సలను అందించే అవకాశాలు వైద్యులకు కలుగుతుంది. మీలో ఏదేని లక్షణం కనిపించినా.. లేదా సమస్యలు ఉత్పన్నమైన తరుణంలో వెంటనే వైద్యులను సంప్రదించి వారి అనుమతి మేరకు మామోగ్రఫీ తీసుకోవడం ఉత్తమం. నలభై ఏళ్లు దాటిన మహిళలు ప్రతీ ఏడాది లేదా రెండేళ్లకు రెగ్యులర్ మామోగ్రామ్‌లను తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో మరణించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

బ్రెస్ట్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)

రొమ్ము MRI (ఎంఆర్ఐ) రొమ్ము చిత్రాలను తీయడానికి అయస్కాంతాలు మరియు రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న మహిళలను పరీక్షించడానికి మామోగ్రామ్‌లతో పాటు బ్రెస్ట్ ఎంఆర్ఐ ఉపయోగించబడుతుంది. క్యాన్సర్ లేనప్పుడు కూడా రొమ్ము ఎంఆరఐలు అసాధారణంగా కనిపించవచ్చు, సగటు ప్రమాదం ఉన్న మహిళలకు అవి ఉపయోగించబడవు.

క్లినికల్ బ్రెస్ట్ పరీక్ష

క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ అనేది ఒక వైద్యుడు లేదా నర్సు చేసే పరీక్ష, బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో వచ్చే రోగుల రోమ్ములో గడ్డలు లేదా ఇతర మార్పులను పరిశీలించే ప్రక్రియను అమె లేదా నర్సు తన చేతులను ఉపయోగించి పరీక్ష నిర్వహిస్తారు.

రొమ్ము స్వీయ-అవగాహన

మీ రొమ్ములు ఎలా కనిపిస్తాయో, ఎలా అనిపిస్తుందో మీరు తెలుసుకోవడం ముఖ్యం. దీని వలన గడ్డలు, నొప్పి లేదా ఆందోళన కలిగించే పరిమాణంలో మార్పులు వంటి లక్షణాలను గమనించరా లేదా అన్న విషయంలోనూ స్వీయ అవగాహన మీకు సహాయపడుతుంది. మీరు గమనించిన ఏవైనా మార్పులను మీ వైద్యుడికి లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాతకు నివేదించాలి. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకోవడం లేదా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ కు తగు స్థాయిలో చికిత్స అందించి.. రోగిని మృత్యుఒడి నుంచి బయటకు తీసుకువచ్చే అవకాశం వైద్యులకు లభిస్తుంది.

రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చిట్కాలు:

శరీర బరువు నిర్వహణ: ఆరోగ్యకరమైన బరువు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ, ఇది గుండె ఆరోగ్యాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవంతమైన బరువును మెయింటైన్ చేయడానికి యోగా, వ్యాయామంతో పాటు డైట్ కంట్రోల్ కూడా పాటించాలి.

పోషకాహారం ముఖ్యం: ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనదని తెలిసినప్పటికీ, ప్రజలు దానిని తమ జీవనశైలిలో చేర్చుకోవడంలో తరచుగా విఫలమవుతారు. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సమతుల్య ఆహారం తప్పనిసరి అని గుర్తించాలి. పుట్టగొడుగులు, బ్రోకలీ, దానిమ్మ, బీన్స్, చిక్కుళ్ళు మరియు బచ్చలికూర ఎల్లప్పుడూ ప్లేట్‌లో ఉండాలి.

వ్యాయామం తప్పనిసరి: శారీరకంగా చురుకుగా ఉండటానికి వివిధ వ్యాయామాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శారీరక మరియు మానసిక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడానికి అరగంట కంటే తక్కువ కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. నిపుణులు ప్రతి వారం కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి: మద్యం, ధూమపానం మరియు మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకు పరిశుభ్రమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మన ఆరోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్య సమస్యల ప్రమాదం నుండి మనలను కాపాడుతుందని గుర్తుంచుకోవాలి.

వైద్యునితో వివరంగా మాట్లాడండి: కొన్ని మందులు, గర్భనిరోధకాలు మరియు హార్మోన్ పునఃస్థాపన చికిత్స రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. మీ వ్యక్తిగత వైద్యునితో రొమ్ము క్యాన్సర్ గురించి బహిరంగంగా మాట్లాడండి. విషయాలు నేర్చుకోండి. వారి సలహాలు తీసుకుని ఆరోగ్యవంతమైన జీవితానికి అడుగులు వేయండి. రొమ్ములలో ఏదైనా అసాధారణతను గుర్తించినట్లయితే వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి.

ఒక సూచనను..

స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ సంకేతాలు, లక్షణాల కోసం రొమ్మును స్కాన్ చేసే ప్రక్రియ. స్క్రీనింగ్‌లో రొమ్ము మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్, మామోగ్రామ్, ఇతర క్లినికల్ పరీక్షలు వంటి కొన్ని సాధారణ పద్ధతులు ఉంటాయి. ఇవి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించలేనప్పటికీ, ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో సహాయపడతాయి. ముందుగా గుర్తించడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చని ఇప్పటికే వైద్యులు సూచించారు.