గాఢ నిద్రలోకి జారుకున్న మనిషిని తట్టిలేపినా వారు నిద్రావస్థ నుండి తేరుకోవడం కష్టం. కానీ మీ శరీరంలోని అవయవాలే తట్టి లేపితే.. నిద్రాభంగం కలిగిస్తే.. మీకు పట్టలేనంత చిరాకురావడం సహజమే. మరి అలాంటిది ప్రతీరోజు ఏర్పడితే.. వారికి కంటి నిండా నిద్ర కరవవ్వడం.. ఫలితంగా ఆరోగ్యంపై ప్రభావం చూపడం సహజం. రోజుకో పర్యాయం నిద్రలో ఇలా మేల్కొనాలంటేనే వారి బాధ వర్ణనాతీతం. మరి అలాంటి నేపథ్యంలో కొందరు మాత్రం ఏకంగా రెండు మూడు సార్లు నిద్ర లేవాల్సి వస్తుంది? వారి బాధ చెప్పనలవికాదు. నిద్రలోకి జారుకున్న తరువాత మూత విసర్జన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది. ఈ పరిస్థితిని అసలేమని అంటారు అన్న వివరాల్లోకి వెళ్తే.. రాత్రిపూట మూత్రవిసర్జన చేయడం (నోక్టురియా) అని పిలుస్తారు. ఈ సమస్య మహిళల కన్నా పురుషుల్లోనే అధికం కాగా, మరీముఖ్యంగా వృద్ధులలో ఎక్కువ. నిద్రలో ఉన్నప్పుడు నిద్ర లేవడం చాలా మందికి పరిపాటి. ఇది వారి తదుపరి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది.
రాత్రిపూట మెలకువగా ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేయడం సహజం. ఇది సమస్య కాదు. కానీ మంచి నిద్రలోకి జారుకున్న తరుణంలో ఇలా మూత్ర విసర్జన మిమ్మల్ని నిద్రలేపితే అది సమస్య. మంచి నిద్రలో రోజుకు రెండుసార్లు మూత్ర విసర్జన చేయడానికి మేల్కొలపడం నాక్టూరియాగా వైద్యులు పరిగణిస్తారు. ఇది యుక్త, మధ్యస్థ వయస్సులోని వారిలో పెద్దగా కనిపించకపోయినా.. వృద్దాప్యంలో మాత్రం నోక్టురియా ప్రభావాన్ని చూపుతుంది. ఇది వయస్సుతో పెరుగుతుంది. డెబ్బై ఏళ్లు పైబడిన పురుషులలో 70-90శాతం మంది నోక్టురియాతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఇటు యువతపై కూడా ప్రభావం చూపుతుంది. 20 నుండి 40 ఏళ్ల లోపు యువతలో 20-44 శాతం మంది దీనితో బాధపడుతున్నారని అంచనా.
నోక్టురియా రకాలు:
రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేయడం నోక్టురియా అని వైద్యపరిబాషలో పిలుస్తారు. కాగా ఈ నోక్టురియాలో నాలుగు రకాలు ఉన్నాయి:
- నాక్టర్నల్ పాలీయూరియా: కేవలం రాత్రి సమయంలో అధిక మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేయడం.
- గ్లోబల్ పాలీయూరియా: పగలు, రాత్రి సమయంలో అదనపు మూత్రాన్ని ఉత్పత్తి చేయడం.
- రాత్రిపూట మూత్రాశయం సామర్థ్యం తగ్గడం: మూత్రాశయం రాత్రి సమయంలో ఎక్కువ ద్రవాన్ని కలిగి ఉండదు.
- మిశ్రమ నోక్టురియా: ఇది పైమూడు రకాల నోక్టురియాల లక్షణాల కలయిక.
నోక్టురియా రావడానికి వివిధ కారణాలు:
నిజానికి రాత్రి నిద్రలో మూత్ర విసర్జన చేయడమన్నది సమస్య కాదు. లక్షణం మాత్రమే. సహజంగా ఈ నోక్టురియా సమస్య ఒఏబి వల్ల ఉత్పన్నమవుతుంది. ఇందుకు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. అయితే రోగులు ఎదుర్కొనే నోక్టురియ రకాన్ని బట్టి కారణాలు ఉంటాయి:
1. నాక్టర్నల్, గ్లోబల్ పాలీయూరియా కారణాలు:
- అదనపు ద్రవాలు, ముఖ్యంగా కెఫిన్ కలిగిన పానీయాలు లేదా నిద్రవేళ సమీపంలో మద్యం
- చికిత్స చేయని లేదా సరిగా నియంత్రించబడని టైప్ 1 లేదా 2 మధుమేహం
- రక్తప్రసరణ గుండె వైఫల్యం
- మీ కాళ్ళ వాపు
- స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలు
- డయాబెటిస్ ఇన్సిపిడస్
- గర్భధారణ మధుమేహం
- కొన్ని మందులు
2. రాత్రిళ్లు మూత్రాశయం సామర్థ్యం తక్కువకు కారణాలు
- మూత్రాశయం అడ్డంకి
- మూత్రాశయం ఓవర్యాక్టివిటీ
- మూత్ర మార్గము సంక్రమణం
- మూత్రాశయం వాపు
- మూత్రాశయం కణితి
- మధ్యంతర సిస్టిటిస్
- పురుషులలో నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా, లేదా పెరిగిన ప్రోస్టేట్
- గర్భం
3. నోక్టురియాకు కారణమయ్యే కొన్ని మందులు:
- గుండె గ్లైకోసైడ్లు
- డెమెక్లోసైక్లిన్ (డెక్లోమైసిన్)
- లిథియం
- మెథాక్సిఫ్లోరేన్
- ఫెనిటోయిన్ (డిలాంటిన్)
- ప్రొపోక్సీఫేన్
- అధిక విటమిన్ డి
- ఫ్యూరోసెమైడ్ (లాసిక్స్), టోర్సెమైడ్ (డెమాడెక్స్) వంటి మూత్రవిసర్జనలు
పాలియురియా
శరీరం మూత్ర ఉత్పత్తిని ఎక్కువగా చేయడాన్ని పాలియూరియా అంటారు. మూత్ర ఉత్పత్తి చాలా ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో దానిని పలు పర్యాయాలు విసర్జించాల్సి వస్తుంది. అయితే మూత్ర ఉత్పత్తి పెరుగుదలకు కారణాలు ఏమిటీ? అందుకు ప్రధాన కారణం నీరు, ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం. నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మంది అనుకుంటారు. రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తాగేవారూ ఉన్నారు. నీరు మన శరీరానికి చాలా అవసరం కానీ ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదు.
ఇక రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించే ముందు నీరు తాగడం వల్ల నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉండవన్న వైద్యసూచనలతో చాలా మంది రాత్రి పడుకునే ముందు రెండు, మూడు గ్లాసుల నీళ్లు తాగుతారు. ఇక అంతకుముందే పాలు, మజ్జిగ తీసుకుని ఉంటారు. రాత్రిపూట హాయిగా నిద్రపోతాం కాబట్టి శరీరానికి ఎలాంటి పని ఉండదు కాబట్టి చమట పట్టదు. దీంతో ఉక్కపోయడం లాంటి మార్గాల ద్వారా శరీరంలోని నీరు బయటకు వెళ్లదు. దీంతో అవసరమైన దానికంటే ఎక్కువ నీరు, ద్రవాలు తాగితే, అది మూత్రంగానే బయటకు విసర్జించాల్సి ఉంటుంది. రోజుకు 2.5 లీటర్ల కంటే ఎక్కువ మూత్రం ఉత్పత్తి చేయబడితే, రాత్రిపూట లేవవలసిన అవసరం కూడా పెరుగుతుంది.
అధిక మూత్ర ఉత్పత్తికి మరో ప్రధాన కారణం అనియంత్రిత మధుమేహం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు, మూత్రపిండాలు దానిని విసర్జించడానికి చాలా కష్టపడాలి. దీని వల్ల ఎక్కువ మూత్రం వస్తుంది. మధుమేహం వల్ల మూత్రాశయ పనితీరు కూడా ప్రభావితమవుతుంది. దీనివల్ల ఎక్కువ మూత్రం పోవచ్చు. డయాబెటిస్ ఇన్సిపిడస్ కూడా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. పేరుకు మధుమేహం అంటున్నా.. దానికి మూలం యాంటిడియురేటిక్ హార్మోన్ (ADH). దీనిని అర్జినైన్ వాసోప్రెసిన్ (AVP) అంటారు. ఇది మెదడులోని హైపోథాలమస్‌లో ఉత్పత్తి అవుతుంది, పిట్యూటరీ గ్రంధి ద్వారా విడుదల అవుతుంది. ఇది మూత్రపిండాలలోని నెఫ్రాన్లలోని గొట్టాలు నీటిని పీల్చుకునేలా చేస్తుంది, మూత్ర ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది మలంలోని ద్రవాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్‌లో, ఈ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి చేయబడదు. దీంతో మూత్రం సన్నగా మారి పెద్ద మొత్తంలో బయటకు వస్తుంది. మలం నుండి అదనపు నీటిని పోగొట్టుకున్నప్పుడు, శరీరం దానిని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో దాహం వేసి.. ఎక్కువగా నీటీని తీసుకుంటారు. ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది.
నాక్టర్నల్ పాలీయూరియా:
కొంతమంది పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు. దీనినే నాక్టర్నల్ పాలియూరియా అని అంటారు. ఈ తరహా సమస్య ఉత్పన్నం కావడానికి వివిధ అంశాలు దోహదం చేస్తాయి. వయస్సుతో పాటు వాసోప్రెసిన్ ఉత్పత్తి తగ్గడం వీటిలో ఒకటి. ఇది కొన్నిసార్లు ముఖ్యంగా రాత్రి సమయంలో తగ్గుతుంది. దీనివల్ల మూత్రం మరింత పలచబడుతుంది. మరొక ప్రధాన కారణం కాళ్ళ వాపు.
హార్ట్ ఫెయిల్యూర్, లివర్ డిసీజ్, తక్కువ ప్రొటీన్ తీసుకోవడం వంటి సమస్యలతో బాధపడేవారు కాళ్లు వాపుకు గురవుతారు. దీర్ఘకాలిక పనులు చేసేవారిలోనూ ఇది కనిపిస్తుంది.
అలాంటి వారికి రోజులో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం వల్ల కాళ్లలో నీళ్లు వెనక్కి వెళ్లిపోతాయి. ఇది రక్త పరిమాణాన్ని పెంచుతుంది.
దీని కారణంగా, మూత్రపిండాలు రక్తాన్ని ఎక్కువగా ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది.
నిద్ర సమస్యలు:
కొందరికి నిద్ర సమస్యలు.. ముఖ్యంగా నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోవడం (అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) కూడా నోక్టురియాకు దారి తీస్తుంది. ఊపిరి ఆగిపోయినప్పుడు అవి గట్టిగా ఊపిరి
పీల్చుకుంటాయి. అప్పుడు కడుపులో ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన గుండె కండరాల కణాల నుండి కర్ణిక నాట్రియురేటిక్ పెప్టైడ్ విడుదల అవుతుంది. ఇది మలం నుండి నీటిని
బహిష్కరించడాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా, మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది.
తగ్గిన మూత్రాశయం సామర్థ్యం:
మనుషుల మూత్రాశయం సాధారణంగా 400-600 మీ.లీ మూత్రాన్ని కలిగి ఉంటుంది. కొందరిలో ఈ సామర్థ్యం తగ్గిపోవచ్చు. ఒకసారి 400 మి.లీ. మూత్నాన్ని పట్టి ఉంచే మూత్రాశయం.. కేవలం 200 మి,లీలకే నిండినట్లు అనిపించవచ్చు. దీనివల్ల తొందరగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. బ్లాడర్ ఇన్ఫెక్షన్లు, బ్లాడర్ ట్యూమర్లు, క్షయ, ఇంటర్‌స్టీషియల్ సిస్టిటిస్, బ్లాడర్‌లో రాళ్లు దీనికి దారితీస్తాయి.
ప్రోస్టేట్ గ్రంధి వాపు:
రాత్రిపూట మూత్రవిసర్జన చేయడం అన్నది వృద్దాప్యంలో వచ్చే అతిపెద్ద సమస్యకు కారణం ప్రోస్టేట్ గ్రంథి మూత్రనాళాన్ని చుట్టుముట్టడం. అది ఉబ్బినప్పుడు, మూత్రనాళం ఇరుకైనది. మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తోంది. గర్భం దాల్చిన తర్వాత మహిళల్లో మూత్ర సమస్యలు మొదలవుతాయి. కొందరిలో మూత్ర నాళం కుంచించుకుపోయి మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవచ్చు. ఇది మూత్రాశయం మీద ఒత్తిడిని పెంచుతుంది, మీకు మూత్ర విసర్జన చేయాలనే కోరికను కలిగిస్తుంది.
అతి చురుకైన మూత్రాశయం (ఒఏబి):
మూత్రము పగలు, రాత్రి తేడా లేకుండా ఎక్కువ సార్లు వెళ్లేందుకు కారణం మూత్రాశయ బ్లాడర్ అతిచురుకుగా స్పందించడం. దీనినే ఒఏబి అని అంటారు. మూత్రాశయ కండరాల క్రమబద్ధీకరణ అతిగా క్రియాశీలతతో కూడివున్న క్రమంలో ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య ఉత్పన్నమైనవారిలో రాత్రిపూట మాత్రమే కాకుండా పగలు కూడా తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. ఈ తరహా కేసులలో మూత్రం కాస్తంత నిండినప్పుడు మూత్రాశయం సంకోచించడం ప్రారంభమవుతుంది. దీనితో వారు మూత్రాన్ని విసర్జించేందుకు వెళ్లేలా చేస్తుంది. అంతేకాదు పలు సందర్భాల్లో మలవిసర్జన చేయమని తక్షణ కోరిక ఉత్పన్నమవుతుంది. కొన్నిసార్లు ఇది బాత్రూమ్‌కు వెళ్లే ముందు బట్టలపై పడిపోతుంది. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం స్పష్టంగా లేదు.
మందులు:
గుండె, కాలేయ వైఫల్యం ఉన్నవారిలో కాలు వాపును తగ్గించడానికి మూత్రవిసర్జనలు సూచించబడతాయి. కొందరు దీనిని రాత్రిపూట ఉపయోగిస్తారు. ఇవి రాత్రిపూట మూత్ర విసర్జనకు దారితీస్తాయి.
రాత్రిపూట మూత్రాన్ని నిర్ణయించడంలో ఎన్ని సార్లు, ఎంత మూత్రం విసర్జిస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఒక్క పూర్తి రోజులో లేదా రెండు రోజులు రాత్రిబవళ్లు ఏ సమయంలో మూత్ర విసర్జన చేసారు? మీకు ఎంత మూత్రం వచ్చింది? వీటిని పేపర్‌పై పట్టిక రూపంలో నమోదు చేస్తే సమస్య స్పష్టమవుతుంది. ఇది మూత్రాశయ సామర్థ్యాన్ని కూడా తెలుపుతుంది. ఒకసారి 300 మి.లీ మూత్రం బయటకు వచ్చి ఆ తర్వాత కేవలం 10 మి.లీ. మూత్రము మాత్రమే విసర్జించారంటే ఇది మానసిక భావనతోనే కావచ్చు. అలవాటు కొద్ది లేదా స్నేహితులు వెళ్తున్నారని అలా వెళ్లి విసర్జించవచ్చు. అంతేకానీ మీకు నిజంగా మూత్రవచ్చి కాదు. ఇలా చేయడం కేవలం మానసిక కారణాల వల్ల మాత్రమే కావచ్చు. లేక అలవాటు అలా వెళ్లి ఉండవచ్చు. ఎందుకంటే అంత తక్కువ మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రతి గంటకు మేల్కొని మూత్ర విసర్జన చేస్తారని చెబుతారు. అయితే అలా చెప్పడం కన్నా వారు రాసిన పేపర్ పై పట్టికను చూస్తే వైద్యులకు కచ్చితమైన వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. దీంతో వారికి చికిత్స చేయడమే కాకుండా మందులు వారిపై ఎంతవరకు ప్రయోజనకరంగా పనిచేస్తున్నాయన్న వివరాలు తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. వైద్యులు రాసిన మందు వేయడం ప్రారంభించిన తర్వాత మూత్ర విసర్జన పట్టికను రాయడం వారికే మేలు చేస్తుంది.
యూరినాలిసిస్:
యూరిన్ అనాలిసిస్, యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించడం ద్వారా మూత్రంలో ఏవైనా ఇన్పెక్షన్లు ఉంటే అవి బయటపడతాయి. మరీ ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల మూత్రంలో గ్లూకోజ్, ఇన్ఫెక్షన్ తో బాధపడేవారి మూత్రంలో చీము ఎక్కువగా ఉంటాయి. మామూలు మూత్ర పరీక్షలోనే వీటిని నిర్థారిస్తారు. యూరిన్ కల్చర్ పరీక్షలో బ్యాక్టీరియా రకాలు, అందుకు తగిన యాంటీబయాటిక్ వివరాలు తెలుసుకోవచ్చు.
అల్ట్రాసౌండ్ స్కాన్:
మూత్రాశయం గోడ దృడంగానే ఉందా? కణితులు ఏమైనా ఉన్నాయా? మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవుతుందా? లేదా? లోపల ఏమైనా మిగిలి ఉంటుందా.? పురుషులలో ప్రోస్టేట్ గ్రంధి ఉబ్బిందా? అనేవి ఇందులో వెల్లడవుతాయి.
అస్మాలిటీ పరీక్ష:
ఇది మూత్ర చిక్కదనం తెలుసుకునే పరీక్ష. డయాబెటిస్ ఇన్సిపిడస్ ఉన్నవారిలో మూత్ర స్నిగ్ధత తక్కువగా ఉంటుంది. ఈ పరీక్షతో మూత్ర చిక్కదనం, తీరుతెన్నులను తెలుసుకునే వీలుంటుంది.
యురోడైనమిక్ అధ్యయనం:
మూత్రాశయం ఎలా స్పందిస్తుందన్న వివరాలు తెలుసుకోవడానికి యూరో డైనమిక్ పరీక్ష ఉపయోగపడుతుంది. మూత్రాశయం ఒత్తిడి, మూత్రాశయ సామర్థ్యం ఈ పరీక్షలో వెల్లడవుతాయి.
అనార్థాలు ఎన్నెన్నో:
చాలా మంది నిద్రలోంచి లేచి మూత్రానికి వెళ్లిరావడం పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. అసలు ఇది సమస్య అనో లేదో లక్షణంగానూ గుర్తించరు. మధ్యరాత్రిలో గాఢనిద్రలోంచి లేచి మూత్రానికి వెళ్లడం సాధారణ విషయంగానే పరిగణిస్తారు. ఈ విషయాన్ని చెప్పాలని కదా.? అని కుటుంబికులు ప్రశ్నిస్తే.. నిద్రలోంచి లేచి మూత్రానికి వెళ్లి రావడం కూడా ఓ సమస్యేనా.? ఏమవుతుంది. మహా అంటే కాసింత సమయం నిద్రకు భంగం కలుగుతుంది అంతేగా అని అంటారు. అయితే ఇది కేవలం నిద్రను మాత్రమే కాదు.. హాయిగా జీవించటాన్నీ కూడా దెబ్బతీస్తుంది. గాఢ నిద్రలోంచి మేలక్కనటం కారణంగా అది అరోగ్యం మీద కూడా గణనీయమన ప్రభావాన్ని చాటుతుంది. రాత్రి సమయంలో తరచుగా మేల్కొలపడం వల్ల నిద్ర అస్తవ్యస్తం అవుతుంది. దీనివల్ల మరుసటి రోజు హుషారుగానూ, ఉల్లాసంగా అనిపించదు. నిరుత్సాహం, నీరసం, విసుగు కలుగుతుంది. విషయ గ్రహణ శక్తి కూడా తగ్గవచ్చు.
దీంతో సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. రాత్రిపూట టాయ్ లెట్ లోకి వెళ్లేటప్పుడు కిందపడిపోవచ్చు. దీంతో కొన్నిసార్లు ఎముకలు విరిగిపోవచ్చు. నోక్టురియా కారణంగా మరణాల ప్రమాదం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. పనులు, ఉద్యోగాల్లో సమర్థత తగ్గి ఆర్థికంగానూ నష్టపోతున్నామని పలువురు పేర్కొన్నారు.
జీవనశైలి మార్పులు ప్రధానం:
నోక్టురియాను తగ్గించడానికి జీవనశైలిని మార్చడం చాలా ముఖ్యం. ఇలాంటి సమస్య ఉన్నవారికి ఇది ప్రధాన చికిత్స. ఇది సమస్యకు చాలావరకు కుదురుకునేలా చేయవచ్చు
- అవసరానికి మించి నీళ్లు తాగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
- ద్రవపదార్థాలు తీసుకోవడం తగ్గించడం వల్ల మూత్ర విసర్జన తగ్గుతుంది.
- మరీ ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవడం తగ్గించాలి.
- రాత్రి భోజనం చేసేటప్పుడు నీరు కొద్దిగానే తీసుకోవాలి.
- కాఫీ, శీతల పానీయాలు, ఆల్కహాల్ మిమ్మల్ని ఎక్కువగా మూత్ర విసర్జనకు గురి చేస్తాయి. వీటిని తగ్గించాలి లేదా మానేస్తే మరీ మంచిది.
- నిద్రపోయే ముందు మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయాలి.
- నిద్రకు భంగం కలిగించే ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ఎందుకంటే నిద్ర లేవగానే మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుంది.
- క్రమం తప్పకుండా వ్యాయామం. బరువును అదుపులో ఉంచుకోవాలి.
- కాళ్లు ఉబ్బి ఉంటే, పగటిపూట పొడవాటి సాక్స్ ధరించాలి.
నోక్టురియాకు కారణాన్ని బట్టి చికిత్స:
రాత్రి వేళ నిద్రలోంచి లేచి మూత్ర విసర్జన చేయడానికి చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. అసలు సమస్య తగ్గితే మూత్ర విసర్జన సమస్య తొలగిపోతుంది.
- ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడాలి. మూత్రాశయంలో రాళ్లుంటే చికిత్స చేయాలి.
- ప్రోస్టేట్ గ్రంధి ఉబ్బిఉంటే ఆల్ఫాబ్లాకర్స్ మందులు వాడాలి. అవసరమైతే, ఆపరేషన్ చేసి గ్రంథి సైజును తగ్గించాలి.
- అతి చురుకైన మూత్రాశయం ఉన్నవారు యాంటీకోలినెర్జిక్ మందులు వాడితే ప్రయోజనం.
- మూత్రం ఉత్పత్తిని తగ్గించేందుకు కొందరికి వాసోప్రెసిన్ మాత్రలు అవసరం ఏర్పడవచ్చు. దీంతో నిద్రలోంచి లేచి మూత్రవిసర్జన చేయాల్సిరావడం తగ్గుతుంది. అయితే వీటితో వయస్సు పైబడినవారిలో సోడియం స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంది. దీంతో ఈ సమస్యతో బాధపడుతున్న 35-40 ఏళ్లలో మధ్యవారికి వీటిని ఇవ్వచ్చు.
మూత్రవిసర్జన పెరగడానికి కారణమయ్యే మాత్రలు తీసుకునే వ్యక్తులు సమయాన్ని కాసింత ముందుకు మార్చవలసి ఉంటుంది. మీరు సాయంత్రం 4 గంటలలోపు మాత్ర వేసుకుంటే, నిద్రకు ఉపక్రమించే సమయం లోపు ఎక్కువగా మూత్రాన్ని విసర్జిస్తారు. కాళ్లలో నీరు చాలావరకు బయటకు వస్తుంది. ఒంట్లో నీరు ఎక్కువగా ఉండదు కాబట్టి తరచుగా నిద్ర లేవడం కూడా తగ్గుతుంది. కొన్ని రకాల బీపీ మాత్రలలో రక్తపోటు తగ్గించేందుకు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు రెండూ కలసి ఉంటాయి. రాత్రి మూత్రవిసర్జనతో బాధపడేవారు వీటిని విడివిడిగా వాడుకోవడం వల్ల రాత్రిళ్లు నిద్రలోంచి లేచే పని ఉండదు. మూత్రం వచచేలా చేసే మందులను వీలైనంతవరకు ఉదయమే వాడుకుంటే రాత్రిపూట ఇబ్బంది ఉండదు.