వృద్ధాప్యంలో కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా.. ఎలా..?

0
Cheerful life in old age

యవ్వన దశలో విద్యను పూర్తి చేసుకుని ప్రోఫెషనల్ డిగ్రీ పట్టా చేతికందగానే ఉద్యోగ వేట.. ఆ తరువాత ఉద్యోగంలో స్థిరత్వం కోసం.. ఆ పిమ్మట పదోన్నతి కోసం.. ఇలా ఓ వైపు పోటీ ప్రపంచంలో తన శక్తినంతా వెచ్చించి సంస్థకు లాభాలను గడించి పెట్టడంతో పాటు.. మరోవైపు పెళ్లి, భార్య, పిల్లలతోనూ చాలీచాలనంత సమయాన్ని కేటాయిస్తూ.. తమకు తెలియకుండానే.. ఏళ్లు గడిచిపోయి.. తీరా చూస్తే.. ఐదు పదుల వయస్సులోకి వచ్చేసి.. రిటైర్మెంట్ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. శరీర వ్యాయామంతో ఉద్యోగాన్ని చూసుకున్న వారు అయ్యో అప్పుడే పదవీ విరమణ వయస్సుకు వచ్చేశానా.? అంటూ తెగ బాధపడిపోతుంటారు.

కాగా, ఒత్తిళ్లకు లోనై.. అటు ఉద్యోగంతో పాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా మోస్తూ.. కుంగిపోయిన వారు మాత్రం పదవీ విరమణ వయస్సు రాగానే పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటారు. ఇక ఆ తరువాత తాము పడిన శ్రమను పక్కనబెడితే.. అనారోగ్యాలతో అసుపత్రులకు తిరగడానికే మిగితా జీవితం సరిపోతుంది. అయినా సరే.. వయస్సు పెరుగుదల శరీరానికే కానీ మనస్సుకు కాదు అనుకుంటూ.. మిగిలిన జీవితాన్ని హ్యాపీగా ఎలా జీవించాలని ఆశపడని వారుండరు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. అయితే వృద్ధాప్యంలోనూ మీరు అలా జీవించాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ.. చిన్నగా ప్రారంభిస్తూ వెళ్తే.. చిన్న వయసులోనూ యవ్వనంగా కనిపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవి ఏమిటో మీరు తెలుసుకుందామా..!

వృద్ధాప్యాన్ని జయించాలని ఎవరు కోరుకోరు? ఆయురారోగ్యాలతో ఆయుష్సును పెంచుకోవాలని మాత్రం ఎవరు కాదంటారు? నిత్య యవ్వనంగా ఉండాలని ఎవరు కోరుకోరు? మీకు వృద్ధాప్యం వచ్చినా హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలని కోరుకుంటున్నవారు.. తమ జీవనశైలిని బాల్య, యవ్వన దశకు తీసుకెళ్లాలి. బాల్యంలో ఎవరితో ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా హాయిగా ఆడుకునేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా.. ఆరవై దాటిన తరువాత అదే తీరును అవలంభించాలి. ఇలా నలుగురిలో ఉంటే.. అదే ఆనందానికి, అందానికి, ఆకర్షణీయంగా మారుతుంది. మరి దీనికి ఏం చేయాలి? పెద్దగా చేయడానికి ఏమీ లేదు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

స్నేహితులతో సరదాగా

స్నేహితుల సమక్షంలో ఉండే ఉత్సాహం వేరు. మన బాధలు, సంతోషాలు పంచుకోవడానికి స్నేహితులను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. మనం ఎక్కడ నివసిస్తున్నాము? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావ్? ఇతరులతో గడిపిన సమయం దీర్ఘాయువుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

సృజనాత్మకంగా

వృద్దాప్యం అంటే జ్ఞాపకాల నెమరువేసుకోవడం, లేదా పిల్లల గురించి అలోచనలు, మనవలు, మనవరాళ్లతో మాట్లాడమే ఇంకేముంది.. అనుకుంటూ పోరబాటే. కుటుంబంతో సమయాన్ని కేటాయిస్తూనే.. కొత్తగా అలోచించి.. కూర్చుని తీరిక వేళలో సరదాగా చేసుకునే కొత్త కళలపై దృష్టిసారించడం మీ సమయం ఇట్టే గడిచిపోయేట్టు చేయడంతో పాటు మీ మదిని నిత్యం తొలిచే చిన్న, చితకా సమస్యలను కూడా దూరం చేస్తుంది. డ్రాయింగ్ వంటి సృజనాత్మక కళలు ఆనందాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని మరింత స్పష్టంగా ఆలోచించి హాయిగా జీవించేలా చేస్తుంది. కాబట్టి ఏదైనా లలిత కళలను అభ్యసించడం మంచిది. వీటితో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్కంఠ నెలకొంది. ఇవి ఆయుష్షును పెంచడానికి కూడా సహాయపడతాయి.

తప్పకుండా వ్యాయామం చేయండి

ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు, కాబట్టి మీరు సమయంతో వచ్చిన తంటాలేమీ లేవు. ఇక మీ రోజులోంచి ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం కొంత సమయాన్ని వాకింగ్ కు కేటాయిస్తే చాలు. అలా వీలు కానీ వారు ఉదయం పూట కనీసం రోజుకో గంట పాటు వాకింగ్ చేస్తే.. ఆరోగ్యం మీ సొంతం. దీనికి తోడు మనసు కూడా తేలిగ్గా మారుతుంది. వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మనసును కూడా సంతోషంగా ఉంచుతుంది. ఇది మీలో వృద్ధాప్యంతో వచ్చే చర్మ ముడతలతో పాటు ఛాయలను కూడా తగ్గిస్తుంది. ఈ వయస్సులో ఏం చేయగలం అనే ఆలోచనా విధానాన్ని కూడా మార్చి.. ఏమైనా చేయగలమన్న సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది వయస్సు సంబంధిత అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అయితే అదేపనిగా వ్యాయామం చేయడం కూడా వద్దు. ఇంట్లో తోటపని లేదా ఇంటి చుట్టూ తిరుగుతూ సరిపోతుంది. వారానికి కనీసం రెండున్నర గంటల పాటు శరీరం చురుగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది. మీరు పుషప్స్ మరియు బస్కీలు కూడా చేయవచ్చు.

కొత్త విషయాలపై దృష్టిసారించడం

ఇది మెదడు క్షీణత నుండి రక్షిస్తుంది. తక్కువ ప్రయత్నంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఇంకా మంచిది. యవ్వనంలోనో.. లేక ఉద్యోగం చేస్తున్న సమయంలోనో.. ఫలానా విద్యను నేర్చుకోవాలని అనుకున్నా.. సమయం సరిపోక ఆసక్తిని వదిలేసుకున్న వారు తమ ఆసక్తిని ఇక ఇప్పుడు కొనసాగించవచ్చు. ఇలా లేటు వయస్సులో కొత్త అంశాలపై శ్రద్ద చూపడం వల్ల తమను బిజీగా చేస్తుంది. అయితే ఈ పనులు కూడా కూర్చుని పనిచేసేవిగా కాకుండా కాసింత.. నడుస్తూ.. లేదా వ్యాయామంగా ఉండేలా ఉంటే అటు అరోగ్యానికి, ఇటు మనోల్లాసానికి దోహదపడుతుంది. ఉదాహరణకు- మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే, అది మీ కండరాలకు కూడా మేలు చేస్తుంది. అదే సమయంలో నలుగురితో కలిసి పనిచేయడం అలవాటు అవుతుంది. ఇలా నలుగురిలో ఉంటే మనస్సు తేలికపడుతుంది.

నోరు, దంతాలు శుభ్రంగా

పలు అరోగ్య సమస్యలతో సతమతం అవతున్నవారు ఉదయాన్నే నోటిని, దంతాలను ఎంతగా శుభ్రం చేసుకున్నా.. ఆ తరువాత కొన్ని గంటలకే మళ్లీ ఫ్లాస్ చేరి నోటిలో దుర్వాసన వచ్చి చేరుతుంది. దీనిపై ఒక్కసారిగా విజయం సాధించలేము. దీంతో ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడంతో కొద్ది రోజుల వ్యవధిలోనే విజయాన్ని అందుకోవచ్చు. దంతాల మధ్య సన్నని దారం సాయంతో ఫ్లాస్‌తో శుభ్రం చేయండి. దీనివల్ల చిగుళ్లు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. లేదంటే చిగుళ్లు కిందికి జారిపోయే ప్రమాదం కూడా పోంచివుంది. మీ దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ధూమపానానికి దూరంగా

ఇక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం అంటూ ఇన్నాళ్లు దూమపానం చేయడం, జర్థాను నమలడం చేసింది చాలు. ఇకపై మాత్రం మీ అరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిగరెట్లు కాల్చడం, బిడీ, చుట్టలను కాల్చడం, జర్థా, ఖైనీ, గుట్కాలను నమలడం వల్ల రక్త నాళాలు కుదించుకుపోతాయి. దీని కారణంగా, చర్మం ఉపరితలంపై రక్త సరఫరా తగ్గుతుంది, ముడతలు ఏర్పడతాయి. అవి మిమ్మల్ని వృద్ధాప్యంగా కనిపించేలా చేస్తాయి. ధూమపానం అలవాటుతో గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తలెత్తుతాయి. వీటితో ఉత్సాహం మాత్రమే కాదు.. అందం, ఆకర్షణ తగ్గుతాయి.