ప్రపంచంలో ఆడవాళ్లకు మాత్రమే దక్కిన అదృష్టం గర్భం దాల్చడం. గర్భం అనేది పునఃసృష్టి చేయడం. ఇది పూర్తిగా సృష్టి రహస్యం. లోకంలో నిరంతరం జననమరణాలు నమోదు కావడం అన్నది కూడా సృష్టి రహస్యమే. జననం అన్నది ఆడవాళ్లు చేసే పునఃసృష్టి కాగా, మరణం అన్నది ఆ విధి అడే వింతనాటకం. ఈ పునఃసృష్టి చేయడం అన్నది మహిళలకు మాత్రమే దక్కిన అపురూపమైన కానుక. అయితే గర్భాధారణ, ప్రసవం లేదా మరో ప్రాణానికి ఊపిరి పోయడం అన్నది అంత సులువైన కార్యం కాదు. ఇది మహిళలను మరణం అంచులవరకు తీసుకువెళ్తుంది. నిజానికి మాతృత్వాన్ని పోందడం లేదా గర్భం దాల్చడం అన్నది ఎంతో గొప్పకార్యమని ఆడవాళ్లు బావిస్తారు. ఎంతలా అంటే మాతృత్వాన్ని పోందక పోవడాన్ని ఏదో నేరంగా భావించుకుని కుంగిపోతారు. గర్భం దాల్చని మహిళలను పెద్దవాళ్లు ఏదో పాపం చేసినట్లుగానే పరిగణిస్తారు. ఈ మధ్యకాలంలో గర్భాధారణ పోందడం అన్నది అనేక మార్గాలలో అందుబాటులోకి రావడంతో నిన్నటితరం వేధింపులకు కాసింత బ్రేక్ పడింది.
అయితే వైద్యంరంగంలో గణనీయమైన మార్పులు వచ్చినా.. ఇప్పటికీ కాన్పుల సమయంలో తల్లులు, శిశువుల మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే పలు సూచనలు పాటిస్తే ప్రసవం సులభతరం అవుతుంది. స్త్రీలు గర్భం దాల్చిన నాటి నుంచి నిత్యం సంతోషంగా ఉండేలి. వారి కుటుంబసభ్యులు వారిని ఏ వేధనలు, ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాలి. అప్పుడే పుట్టబోయే శిశువు సంతోషంగా ఉంటుంది. దీంతో పాటు గర్భందాల్చిన తల్లులు ఉపవాసాలకు దూరంగా ఉంటూ పౌష్టికాహారం తీసుకోవాలి. మరీముఖ్యంగా పండ్లు, పండ్ల రసాలు, పప్పు, ఆకు కూరలు, పాలు తీసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, మాంసం తీసుకోవాలి.
గర్భధారణ సంకేతం ఇలా: Signs of pregnancy are:
గర్భధారణ దాల్చడానికి సంకేతాలు ఏమైనా ఉన్నాయా..? అంటే ఉన్నాయనే చెప్పాలి. ఈ సంకేతాలలో మొట్టమొదటి రుతుస్రావం నిలిచిపోవడం. తమ రుతుస్రావం ఎప్పటిలాగే సరైన సమయంలో కాకపోవడంతో దానిని గుర్తించే మహిళలు ఇది తమ గర్భాధారణకు తొలి సంకేతంగా భావిస్తారు. కొందరు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా, మరికొందరు అందుబాటులోకి వచ్చిన ప్రెగ్నెస్నీ కిట్ లతో పరీక్ష చేసుకుని నిర్థారించుకుంటారు. కొందరు మహిళలు వాంతులు, కడుపులో వికారం వంటివి అనుభవిస్తారు. దీంతో వారు వైద్యుల వద్దకు పరీక్షలకు వెళ్లగా విషయం బోధపడుతుంది. క్రమంగా ప్రతీ నెల వచ్చే రుతుస్రావం కాకపోవడంతో తాము నెల తప్పామని అంటారు మహిళలు, దీనినే ‘నెల తప్పడం’ అని వాడుకబాషలో వ్యవహరిస్తారు. గత నెలలో ఎప్పుడు రుతుస్రావం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునే గైనకాలజిస్టులు.. దానికి ఒక వారంరోజులను కలుపుకుని గర్భధారణ సమయాన్ని లెక్కించి అంచనా వేస్తారు. వీటి ఆధారంగానే వైద్య నిపుణులు గర్భిణీస్త్రీలకు ఎప్పుడు నెలలు నిండేది.. ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele’s rule) అంటారు. అంచనా డెలివరీ తేదీ= రుతుస్రావం తప్పిన నెల+ 9 నెలల+ ఏడు రోజులు (EDD = LMP +9 months, 7 days.)
జరాయువు (ప్లాసెంటా) నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగానే ఎక్కువగా గర్భ నిర్థారణ పరీక్షలు పనిచేస్తాయి. గర్భం ధరించిన తరువాత కొద్ది రోజుల్లోనే వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని గుర్తించవచ్చు. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, ప్లాసెంటా ద్వారా స్రవించే కొరియోనిక్ గోనాడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలోని కార్పస్ లుటియం నుండి ప్రొజెస్టెరాన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా, ఎండోమెట్రియం మృదువుగా మారి, రక్త నాళాలు వృద్దికి దోహదం చేస్తాయి. దీని ఫలితంగా, పిండం అభివృద్ధికి అవసరమైన పోషకాలు సరఫరా చేయబడతాయి. గర్భాధారణ జరిగిందా.? అని తొలి దశలో వైద్యులు స్కానింగ్ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో గర్భధారణ ఎప్పుడు జరిగింది అన్న విషయంతో పాటు, పిండం వయస్సును కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ప్రసవం ఎప్పుడు జరుగుతుందన్న సయమాన్ని నేగలీ సూత్రం కన్నా ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలవుతుంది. శాస్త్రబద్ధంగా కాన్పు చేయాల్సిన సమయాన్ని రుతుచక్రం తేదీల ప్రకారం పరీశీలిస్తే కేవలం 3.6 శాతం కేసులలో మాత్రమే నిజమవుతున్నాయి. కాగా, స్కానింగ్ ద్వారా వేసిన అంచానాలు కూడా కేవలం 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా పేర్కోనబడింది.
శిశువు జననం (కాన్పు) ఎప్పుడు జరుగుతుంది.? When will the baby be born?
భార్యభర్తల మధ్య జరిగే సహజ సంభోగంలో, భర్త (పురుషుడు) వీర్యకణాలు భార్య(మహిళ) అండాన్ని ఫలదీకరణం చేస్తుంది. దీని ఫలితంగా స్త్రీ గర్భాశయంలో పిండం ఏర్పడి పెరగడం ప్రారంభిస్తుంది. దీనిని గర్భం (ప్రెగ్నెన్సీ) అంటారు. ఇలా గర్భం ధారణ చెందిన స్త్రీని గర్భవతి (పెగ్నెంట్) అంటారు. అయితే కొందరు మహిళల్లో ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఏర్పడతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతున్న కాలాన్ని గర్భధారణ కాలం అని అంటారు. నిర్ణీత తొమ్మిది నెలల వారం రోజలు పూర్తైన తరువాత గర్భవతి అయిన మహిళ శిశువు జన్మనిస్తుంది. దీనిని పురుడు అంటారు. అన్నీ క్షీరదాలు (మామల్స్)లలోకెల్లా మానవుల గర్భధారణ అంశంలో క్షుణ్ణంగా పరిశోధనలు జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ప్రసూతిశాస్త్రం (ఆబ్స్టెట్రిక్స్) అంటారు. నవమాసాల గర్భధారణ కాలవ్యవధి ఫూర్తైన తరువాత.. (38 నుంచి 40 వారాల అనంతరం) తల్లి శిశువును ప్రసవిస్తుంది. అనగా గర్భం దాల్చిన ఇంచుమించు తొమ్మిది నెలలు లేదా 270 రోజుల తరువాత శిశువు బాహ్యప్రపంచాన్ని వీక్షిస్తుంది.
గర్భధారణ కాలవ్యవధి గణన: Pregnancy Duration Calculation:
పురుషుడి వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరణం చేసిన తరువాత ప్రారంభ దశను ‘పిండం'(ఎంబ్రియో) అంటారు. రెండు నెలలు లేదా ఎనమిది వారాల వరకు సాధారణంగా పిండం అనే పిలుస్తారు. ఆ తరువాత నుంచి పురుడు సమయం వరకు ‘శిశువు’ అని పిలుస్తారు. చాలా దేశాల్లో మానవుల గర్భ ధారణ కాలాన్ని మూడు త్రైమాసికాలుగా (3*3 నెలలు) కాలాలుగా విభజిస్తారు. మొదటి త్రైమాసిక కాలంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ త్రైమాసిక సమయంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. చివరి త్రైమాసిక కాలంలో శిశువు మాతృగర్భాశయం బయట స్వతంత్రంగా జీవించగలిగే స్థాయికి పెరుగుతుంది.
గర్భం దాల్చిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: Precautions to be taken during pregnancy:
- బిడ్డ ఆరోగ్యం కోసం గర్భిణీ స్త్రీలు పోషకాలతో కూడిన అహారం తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, పప్పు, ఆకు కూరలు, చిక్కుళ్లు, పాలు తీసుకోవాలి. మాంసాహారులు చేపలు, మాంసం తీసుకోవాలి.
- గర్భధారణ సమయంలో మొదటి ఆరునెలల పాటు నెలకొక పర్యాయం వైద్యులను సంప్రదించాలి. ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తరువాత వారానికో పర్యాయం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గైనకాలజిస్టులు వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
- గర్భధారణ సమయంలో ఎలాంటి అస్వస్థతకు సొంత వైద్యం చేసుకోరాదు. సొంతంగా మందులు వాడకూడదు. అలాగు ఎక్స్-రేలు తీయించుకోకూడదు.
- ఎత్తుమడమల (హై-హీల్స్) చెప్పులు వాడకూడదు.
- గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీని వల్ల పుట్టబోయే బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది.
- గర్భం దాల్చిన మొదటి మూడునెలలు, తొమ్మిదవ నెలలో దూరప్రయాణాలకు దూరంగా ఉండాలి, వాహనాలు నడపకూడదు.
- రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర పోవాలి. పగటి పూట నిద్రించే అలవాటు లేనివారు కనీసం విశ్రాంతి తీసుకోవాలి.
- నిద్రలో ప్రక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉంటే.. ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.
- గర్భధారణ తరువాత మూడు నెలల నుంచి ప్రసవించిన మూడు నెలల వరకు యోగా, బరువైన పనులు చేయరాదు.
- అయితే ఉదయ, సాయంకాలలు సునాయాస నడక ప్రయోజనకరం.
- ధనుర్వాతం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్ తీసుకోవాలి.
- శిశువు కదలిక తగ్గినట్లు అనిపించికపోయినా, ఉమ్మనీరు పోయినా, రక్తస్రావం, కడుపు నొప్పి వచ్చినా గైనకాలజిస్టును సంప్రదించాలి.
గర్భవతులు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు: Food precautions to be taken by pregnant women:
భారతదేశంలో దాదాపుగా 40 నుంచి యాభై శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నవారే. ఈ వర్గానికి చెందినవారు తీసుకునే ఆహారంలో పోషకాల లోపం ఉందన్నది నిర్వావాద అంశం. అయితే ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి వారి అరోగ్య శ్రేయస్సును కాంక్షిస్తున్నా.. వారి దయనీయస్థితులకు తోడు సరైన అవగాహన లేని కారణంగా ఈ వర్గం ప్రజల్లో పోషకాల లోపం ఉత్పన్నమవుతుంది. ఇక ఈ వర్గానికి చెందిన మహిళల ఆహారంలోనూ అదే సమస్య. దారిద్ర్యరేఖకు దిగువనున్న మహిళలు గర్భందాల్చినప్పుడు తీసుకునే ఆహారాన్ని సాధారణ సమయంలో తీసుకునే అహారంలో పెద్దగా తేడా ఉండదన్నది కాదనలేని వాస్తవం. ఈ వర్గానికి చెందిన మహిళలు అన్నివేళలా ఒకే రకమైన ఆహారం తీసుకుంటారని అధ్యయనాలు తేల్చాయి. పోషకాల లోపంతో పాటు కడుపులోని బిడ్డకు కూడా అహారాన్ని అందించాల్సిన అవసరం ఉన్నా అవగాహనా రాహిత్యంలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల తల్లీ, బిడ్డలపై అనేక ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదాలు పోంచివున్నాయి.
గర్భిణుల్లో పోషకాహార లోపం ప్రతికూలతలు: Disadvantages of Malnutrition in Pregnant Women:
- గర్భవతులు పోషకాల లోపంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శిశువులు తక్కువ బరువుతో జన్మించే ప్రమాదం ఉంది.
- తక్కువ ఆహారం తీసుకోవడం ఒక్కోసారి తల్లీ/బిడ్డల మరణాలకు కూడా దారితీసే ప్రమాదముంది.
- కొందరు తల్లులు అతిగా కొవ్వు పదార్థాలను ఆహారం తీసుకుంటారు. దీని వల్ల ఇటు తల్లితో పాటు అటు శిశువులోనూ కొవ్వు వృద్ది చెంది బరువు పెరుగుతారు.
- పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ పోషకాహారం తీసుకోని పక్షంలో వారిలో, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉండదు.
గర్భవతులు తీసుకోవాల్సిన ఆహారం: Food to be consumed by pregnant women:
- గర్భవతి తీసుకొనే ఆహారం అమెకు పుట్టబోయే బిడ్డ బరువును ప్రభావితం చేస్తుంది.
- ఐదారు నెలలు వరకు ప్రతీ గర్భవతికి 300 కాలరీల ఆహారం తీసుకోవాలి. దీనికి తోడు 5గ్రా మాంసకృత్తులు, 10గ్రా కొవ్వుపదార్దాలు తిసుకోవాలి.
- గర్భవతులు, బాలింతులు అధనపు కాల్షియంతో కూడిన ఆహారం తీసుకోవాలి. శిశువుల్లో ఎముకలు, దంతాలు రూపు దిద్దుకోవటానికి, బాలింతలకు రొమ్ము పాలు పెరగటానికి కాల్షియం అత్యంత అవసరం.
- గర్భధారణ సమయంలో సాధారణంగా ఆయా మహిళల్లో ఐరన్ లోపం తలెత్తుతుంది. ఐరన్ లోపం తలెత్తితే కాన్పు సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదంగా మారవచ్చు.
- ఐరన్ లోపం శిశువు తక్కువ బరువుతో పుట్టేందుకు కూడా కారణం కావచ్చు. అందుకని వారు ఎక్కువ హీమ్ ఐరన్ ఉన్న మాంసాహారం తీసుకోవాలి.
గర్భవతులు పాటించాల్సిన ఆహార నియమాలు: Dietary rules for pregnant women:
- గర్భవతులు తమ ఆహారంతో పాటు కడుపులోని బిడ్డ ఆహారాన్నీ తీసుకోవాలి. దీంతోనే బిడ్డ కూడా బలోపేతం అవుతుంది.
- బాలింతలు కూడా తమ శిశువుల ఆహారమైన పాలు అధికంగా వచ్చేందుకు అదనంగా ఆహారాన్ని తీసుకోవాలి.
- మూడు పూటలా బోజనం కన్నా ప్రతీ రెండు గంటలకు ఏదో ఆహారం, పండ్లు, తీసుకుంటే మరీ మంచిది.
- ఉదయం పూట మొలకెత్తినదాన్యాలు, సాయంత్రం ముడిధాన్యాలు తీసుకోవాలి. బోజనంలోకి పెరుగు తప్పనిసరిగా ఉండాలి. మధ్యాహ్న సమయంలో మజ్జిగ తాగడం మంచిది.
- ప్రతీరోజు పాలు, కోడిగుడ్లు తీసుకోవడంతో పాటు వారానికి కనీసం నాలుగు రోజులు మాంసం తీసుకోవాలి.
- గర్భిణీ స్త్రీలు, బాలింతలు బోజనం తరువాత పండ్లు తప్పక తీసుకోవాలి. అన్నం కన్నా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
- గైనకాలజిస్టు సూచనలు, సలహాల ప్రకారమే ఔషధాలు తీసుకోవాలి.
- గర్భవతులు, బాలింతలకు ఐరన్, ఫోలిక్ చాలా అవసరం. అందుకని వీటిని గర్భం దాల్చిన 14-16 వారాల నుంచి పాలు ఇవ్వడం అపేంతవరకు పోడిగించాలి.
- సహజ ప్రసవం కోసం గర్భవతులు ప్రతీరోజు నీడపట్టున అరగంట సమయం వాకింగ్ చేయాలి. అయితే ఐదో నెల నుంచి బరువు లేపడం వంటి పనులు అసలు చెయ్యరాదు.
- మద్యపానం, దూమపానం వంటి వాటి జోలికి పోకూడదు. పోగాకు, మద్యపానం అలవాట్లు ఉంటే మానుకోవాలి.
- టీ, కాఫీలను శరీరానికి ఐరన్ అందకుండా చేస్తాయి. బోజనం చేసిన గంట వరకు టీ / కాఫీలను సేవించరాదు.
- గర్భము, ప్రసవము అనే అదృష్టం.. సృష్టిలో ఆడవాళ్లకు మాత్రమే దక్కింది. ఇది ఆడవారికి సర్వసాధారణమైన విషయం అని గుర్తుంచుకోండి.
- ప్రసవం గురించిన అంశాలపై అనవసరమైన అందోళన చెందకండి. ఇది కాన్పును కష్టతరము చేస్తుంది.
- గర్భదాల్చినా భార్యాభర్తలు రతిలో పాల్గోనవచ్చు. అతిగా పనికిరాదు. 8-9వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి .
- గర్భవతులు, బాలింతలు రక్తదానానికి దూరంగా ఉండాలి. గర్భధారణ నుంచి బిడ్డకు పాలివ్వడం ఆపే వరకూ రక్తదానం జోలికి వెళ్లరాదు.
గర్భిణులు ఏవిధముగా ఉండాలి? What should pregnant women look like?
గర్భిణులు పునఃసృష్టి సాధకులు. వీరు గర్భధారణ చెందిన క్రమం నుంచి బిడ్డను ప్రసవించేంత వరకు నిత్యం ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. కోపతాపాలకు అస్కారం లేకుండా నిశ్చల మనసుతో ఉంటే.. గర్భంలోని బిడ్డ కూడా నిశ్చలంగా.. నిత్యానందంగా, ప్రశాంతంగా ఉండటమే కాదు.. పెరిగి పెద్దయ్యేక్రమంలోనే అవే లక్షణాలను పునికి పుచ్చుకుంటారు. ఇది బిడ్డ మనోవికాసానికి కూడా దోహదపడుతుంది. అంతేకాదు గర్భిణులు ఎంత నిజాయితీగా ఉంటే బిడ్డలు కూడా అలానే నిత్యజీవతంలో వ్యవహరిస్తారు.
దీనికి తోడు దైవ ఆరాధన, దైవనామస్మరణ, పారాయణాలు చేస్తూ ధర్మప్రవృత్తి కలిగి ఉంటే బిడ్డ కూడా అదే బాటలో పయనిస్తాడు. ఎంతటి చిన్న విషయంలోనైనా సరే అసత్యము పలకరాదు. అప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా సత్యమార్గంలో పయనిస్తాడు. కుటుంభసభ్యులందరితో ఆప్యాయత, అనురాగం కలిగి వుంటే బిడ్డకు కూడా అవే అలవరుతాయి. ఇక గర్భధారణ సమయంలో నీతి కధలు చదువుతూ కాలక్షేపం చేస్తే అవి బిడ్డను సన్మార్గంలో నడుపుతాయి.
నిద్రించేందుకు గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: Precautions to be taken by pregnant women for sleeping:
గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. దాదాపుగా రాత్రి వేళ 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి. ఇక పగలి పూట గంట నుంచి గంటన్నర సమయం నిద్రించాలి. గర్భధారణ కారణంగా శరీరంలో జరిగే మార్పులు గర్భవతుల నిద్రలో ఆటంకాలను తీసుకువస్తాయి. అంతమాత్రం చేత ఎలాంటి అందోళనకు గురికాకుండా.. గైనకాలజిస్టులు చెప్పిన సూచనలు సలహాలను పాటించడం ఉత్తమం. దీంతో నిద్రలోని ఆటంకాలను అధిగమించడానికి దోహదపడుతాయి. ఈ క్రమంలో వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వాటిని ఫాలో అయితే చాలు నిరాటంక నిద్ర గర్భవతుల సోంతం అవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
- సాధారణంగా మీరు ఎలా పడుకున్నా.. గర్భం దాల్చిన మూడవ నెల నుంచి వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిది.
- గర్భవతులు రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందు నుంచి మితంగా ద్రవాలు తీసుకోవాలి. లేనిపక్షంలో మూత్రవిసర్జన నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
- పగటి సమయంలో వీలైనంత మేర ఎక్కువగా ద్రవాలు తీసుకోవడం గర్భవతులకు మంచిది.
- వంట పదార్థాలలో కారం తక్కువగా వేసుకోవాలి. మసాలా అహారాన్ని తీసుకోకపోవడం ఉత్తమం. దీని వల్ల ఛాతీలో మంట పుట్టి.. నిద్రరానివ్వదు.
- గర్భిణులు వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లను పడుకునేప్పుడు వాడుకోవాలి. అవి లభ్యంకాని పక్షంలో మోకాళ్ల మధ్య మరో దిండును పెట్టుకొని పడుకోవాలి.
- పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
- నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.
గర్భిణులకు మానసిక జాగ్రత్తలు: Psychological precautions for pregnant women:
- గర్భిణులు నిద్రించే గదిలో పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ఉంచాలి. వీటిని వారు ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది.
- నిద్రలేచిన వెంటనే గర్భిణులు దేవుడు పటాల్ని చూడటం వారికి ఆ రోజంతా శుభదాయకంగా ఉంటుంది.
- గర్భిణీ స్త్రీలు తమ రోజును సంతోషంగా గడపడానికి చక్కని సంగీతం వినడం కూడా ఎంతో మంచింది. ఇది బిడ్డకు కూడా మేలు చేస్తుంది.
- గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదు. కొత్త వాతావరణం శిశువు మానసిక స్థితి పై ప్రభావం చూపుతుంది.
- గర్భిణీ స్త్రీలు సముద్ర ప్రయాణాలు చేయడం సముచితం కాదు.
- గర్భిణులను వదలి వారి భర్తలు సుదూర ప్రయాణాలు, వలస వెళ్ళుడం లాంటివి చేయరాదు.
- గర్భవతులు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి శ్రాద్ధాన్న భోజనం చేయరాదు.
- గర్భిణులు ఇంట్లోని కుటుంబసభ్యులు, ముఖ్యంగా భర్త పుణ్య తీర్థములు దర్శించడం, అంత్యక్రియలకు హాజరుకావడం సహేతుకం కాదు.
- గర్భవతులు నదీ స్నానము, శవం వద్ద దీపం వెలిగించడం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు.
- గర్భవతులు ఇంట్లో కాలక్షేపంగా సినిమాలు, సీరియళ్లు చూసేప్పుడు భావోద్వేగాలకు గురికాకూడదు.
- గర్భవతులు టీవీలో హింసాత్మక ఘటనల వార్తలు, హారర్, సస్పెన్స్ సినిమాలు వీక్షించరాదు. బదలుగా హాస్యభరిత చిత్రాలు, ఫీల్ గుడ్ చిత్రాల వీక్షణం మంచింది.
- గర్భవతులుండే ఇంటిలో నిర్మాణ మార్పులు చేయడం కూడా శ్రేయస్కరం కాదు. దీని వల్ల వారు కూడా అధిక ఒత్తిడికి గురవుతారు. ఇది శిశువులపై ప్రభావం చూపుతుంది.
గర్భిణులపై మానసిక ఒత్తిడి ప్రభావం: Mental stress effects on Pregnant women:
గర్భధారణ జరిగిన తరువాత ప్రసవం వరకు సదరు మహిళలు ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం సానుకూలంగా ప్రతిఫలించి శిశువు కూడా సంతోషంగా ఉంటారని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. అలా కాకుండా గర్భిణీ స్త్రీ తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తే.. కడుపులోని శిశువుపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి శిశువుల మానసిక వికాసం, శారీరిక ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని తాజాగా వెల్లైడన అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.
గర్భవతులు మానసిక ఒత్తిడికి గురైన నేపథ్యంలో మాతృగర్భంలోని శిశువులపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న క్రమంలో వైద్యరంగం ఎప్పటి నుంచో రకరకాల అధ్యయనాలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భధారణ జరిగిన తరువాత తొలి మూడు నెలల్లో ఆ తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడి గురైన పక్షంలో ఆమెకు పుట్టబోయే బిడ్డలో రక్తహీనత సమస్య ఉత్పన్నం కావచ్చునని తాజా అధ్యయనం తేల్చింది. వీరిలో ఐరన్ లోపం అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువని నివేదించింది. ఇది శిశువు మానసిక, శారీరక ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని ఇజ్రాయెల్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఐరన్ ఖనిజం శిశువుల్లో శారీరక అవయవాల ఎదుగుదలకు సహాయపడుతుంది. మరీముఖ్యంగా శిశువు బుద్ది వికాసానికి ఐరన్ చాలా కీలకం. గర్భిణుల్లో ఐరన్ లోపం ఉండటం, చక్కర వ్యాధి, గర్భధారణ తరువాత కూడా దూమపానం చేయడం లాంటివి శిశువుల్లో ఐరన్ లోపాన్ని పెంచుతాయి. నెలలు నిండకముందే పుట్టిన బిడ్డల్లోనూ ఐరన్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో గర్భిణీ కుటుంబసభ్యులు వారిని ప్రశాంతంగా ఎలాంటి మానసిక ఒత్తిడి లోనుకాకుండా చేసుకోవాలి. అంతేకాదు పండంటి బిడ్డ కలగాలంటే ‘చక్కటి పోషకాహారం’ కూడా ఎంతో అవసరం అని గుర్తెరుగాలి. ఈ రెండు అంశాలపై శ్రద్ధ పెట్టి నవమాసాలు చక్కగా చూసుకుంటే శిశువు జననం మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.